శ్రీసత్యసాయి జిల్లా (కబుర్లు టుడే) జూన్ 25
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, దరఖాస్తులను కాలపరిమితిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన డీఐఈపీసీ సమీక్షాసమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు.
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కుదిరిన అవగాహన ఒప్పందాలు, సీపీబ్ ఒప్పందాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఒప్పందాలు పూర్తి చేసుకున్న పరిశ్రమలు త్వరగా ఉత్పత్తి దశకు చేరుకునేలా అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.
పరిశ్రమలకు అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని, వివిధ శాఖల వద్ద సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటయ్యే ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు అవసరమైన వసతులు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఏపీ ఎంఎస్ఎంఈ, ఈడీపీ, ఐడీపీ 2024-29, టాగ్ పాలసీ కింద దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు రాయితీలను త్వరగా అందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎంఈజీపీ), పీఎం విశ్వకర్మ పథకాల పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు.
ఎంఎస్ఎంఈ రంగంలో డిజిటల్ సర్వేలను నిర్వహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టిఐహెచ్)తో కలిసి చర్యలు చేపట్టాలని సూచించారు. జూలై 6న జరగనున్న “నేషనల్ లెవెల్ డిపార్ట్మెంట్ సమ్మిట్ ఆత్మనిర్భర్ భారత్ - రక్షణ, పర్యావరణ పరిశ్రమల ఎకోసిస్టమ్ ప్రమోషన్” రీజినల్ వర్క్షాప్ను విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జీఎం/డిఐసి, జెడ్ఎం/ఎపిఐఐసి, ఏపీపీసీబీ, ఎల్డిఎం, నాబార్డ్ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
